బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:59 IST)

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో స్థానిక నేతల గిరాకీ

స్థానిక నాయకుల్ని తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా... హుజూర్​నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు కొనసాగుతున్నాయి.

ఓ వైపు యువకులతో సర్వేలు... మరోవైపు ఓట్లు చేకూర్చే నాయకులపై దృష్టి సారించడం... ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, తటస్థులపై కన్నేశాయి తెరాస, కాంగ్రెస్​లు. నామపత్రాల దాఖలుకు ఒక్కరోజే మిగిలుండగా... అభ్యర్థుల తుది జాబితా వెల్లడయ్యే లోపు తటస్థుల్ని తమవైపు తిప్పుకునేలా పావులు కదుపుతున్నాయి.

తెరాస, కాంగ్రెస్​కు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్​నగర్ ఉప ఎన్నికలో... రాజకీయ మంత్రాంగాలు కొనసాగుతున్నాయి. విజయం కోసం స్థానిక నాయకులను మచ్చిక చేసుకునేందుకు... ఇరుపార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

ఏం కావాలన్నా ఇస్తాం కానీ... మీ గ్రామం, లేదా మండలంలోని ఓట్లు మాకే పడాలి... అంటూ తెరచాటుగా మంతనాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరాదన్న ఉద్దేశంతో... అటు గులాబీ దళం, ఇటు హస్తం దండు పెద్దయెత్తున యత్నిస్తున్నాయి.
 
హుజూర్నగర్ బరిలో తెదేపా అభ్యర్థిగా చావా కిరణ్మయి
హుజూర్నగర్ ఉపఎన్నికల బరిలో పోటీకీ సిద్ధమైన తెదేపా.... అభ్యర్థిని ప్రకటించింది. చావా కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటిస్తూ... రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ బి-ఫామ్ అందజేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు తెదేపా అభ్యర్థిగా చావా కిరణ్మయిని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నందుకుగానూ కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించినట్లు రమణ తెలిపారు. చావా కిరణ్మయికి బి-ఫామ్‌ అందించారు. రాష్ట్రంలో పార్టీ పునర్‌వైభవం కోసం కృషి చేస్తానని అభ్యర్థి చావా కిరణ్మయి పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పటిష్ఠంగానే ఉందని నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
 
హుజూర్​నగర్​ బరిలో సీపీఎం
హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో సీపీఎం తన అభ్యర్థిని ప్రకటించింది. అరెపల్లి శేఖర్​రావును బరిలోకి దింపుతున్నట్లు రాష్ట్ర నాయకత్వం తెలిపింది. హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో సీపీఎం నుంచి పోటీచేసే అభ్యర్థి పేరు ఖరారు అయింది. అరెపల్లి శేఖర్​రావును బరిలోకి దింపుతున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.

ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు నామినేషన్​ వేయనున్నారు. మద్దతు కోసం సీపీఐ, తెజసతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
 
తెరాసకు మద్దతుపై అక్టోబర్‌ 1న నిర్ణయం: చాడ
తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస, సీపీఐ పాత మిత్రులమేనని చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత దూరం పెరిగిందని తెలిపారు. ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతుపై అక్టోబర్ 1న తమ నిర్ణయం చెబుతామని చాడ స్పష్టం చేశారు.

తెరాసకు మద్దతిచ్చే అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయాయన్ని వెల్లడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో మద్దతు కోరుతూ... తెరాస నేతలు కేకే, వినోద్‌, నామా నాగేశ్వరరావు సీపీఐ కార్యాలయానికి వెళ్లారు.

తాము కమ్యూనిస్టులము కాకపోయినా... అదే ఆలోచనతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేకే తెలిపారు. తమకు మద్దతునిచ్చే అంశంపై సీపీఐ సుముఖత వ్యక్తం చేస్తుందని ఆకాంక్షించారు. ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతుపై అక్టోబర్ 1న తమ నిర్ణయం చెబుతామని చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు.