1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:48 IST)

భాగ్యనగరి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు

congress flag
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందులోభాగంగా, కేంద్ర నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 
 
ఇటీవల చేపట్టిన సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదేకావడం గమనార్హం. ఈ సమావేశం హైదరాబాద్‌ నగరంలో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జోష్ వస్తుందని భావించింది. దీనికి అధిష్టానం కూడా అంగీకరించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి రానున్నారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ రానుంది.
 
మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది. మొత్తంగా 100 మందికిపైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. 
 
అలాగే, అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టింది. ఈ నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, టి. జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలంతా పాల్గొంటారు.