16 నుంచి హైదరాబాద్ - విజయవాడల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మంగళవారం నుంచి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ బస్సులను అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో ఈ-గరుడ పేరుతో ఈ బస్సులను నడుపనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ నెల 16వ తేదీ మంగళవారం నుంచి హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య పది ఎసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఈ-గరుడగా నామకరణం చేసినట్టు చెప్పారు. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డిలతో కలిసి బస్సులను ప్రారంభిస్తారని తెలిపారు. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.