నీట మునిగిన కలెక్టరేట్ : నెల రోజులు కాకముందే శ్లాబుల నుంచి లీకేజీలు
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన కలెక్టర్ కార్యాలయం నీట చిక్కుకుంది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. దీంతో కలెక్టరేట్ ఏదో వాగులో వున్నట్లు దర్శనమిస్తోంది.
చుట్టూ వరద నీరు చేరడంతో కలెక్టరేట్ అధికారులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా చేరిన వర్షపునీటితో కలెక్టర్ కార్యాలయం ముందున్న గార్డెన్‌లో మొక్కలు పాడయ్యాయి. ఇక వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించే కార్యాలయ సెల్లార్‌లోకి కూడా నీరు చేరడంతో పార్కింగ్‌కు వీలు కాకుండా మారింది.
కలెక్టరేట్ ఆవరణమేకాదు భవన నిర్మాణంలోని డొల్లతనం కూడా ఈ వర్షాలతో బయటపడింది. భవనంలోపల అక్కడక్కడ లీకేజీలు కూడా దర్శనమిస్తున్నాయి. మూడో ఫ్లోర్ పైపులను అమర్చిన ప్రాంతంలోంచి నీరు లీకై భవనంలోకి చేరుకుంటోంది. ఇలాంటి లీకేజీలు కలెక్టరేట్ భవనంలో చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి.