నాలుగు రైళ్లను 24 రోజుల పాటు రద్దు చేసిన ద.మ.రైల్వే
నాలుగు రైళ్లను 24 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కాజీపేట - బల్లార్ష సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. మరో 12 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు.
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (12758), కాజీపేట-సిర్పూర్‌టౌన్ (17003), బల్లార్ష-సిర్పూర్‌టౌన్ (17004) రైళ్లను జూన్ 27 నుంచి జులై 20 వరకు 24 రోజులపాటు రద్దు చేసినట్టు తెలిపింది. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17001), సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ (17002) రైళ్లను జులై 10, 13, 20 తేదీల్లో మాత్రం రద్దు చేసినట్టు పేర్కొంది.
అలాగే, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. భద్రాచలం రోడ్-బల్లార్ష (17003) రైలు జూన్ 27 నుంచి జులై 20 వరకు వరంగల్-బల్లార్ష మధ్య రద్దు చేయగా, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ (17034) జూన్ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్ టౌన్-వరంగల్ మధ్య, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) జూన్ 26 నుంచి జులై 19 వరకు కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) జూన్ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్ కాగజ్‌నగర్-కాజీపేట మధ్య రద్దయ్యాయి.
ఇకపోతే, దారిమళ్లించిన రైళ్లను పరిశీలిస్తే, తిరుపతి - జమ్ముతావి (22705) రైలును జులై 5, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్కేడ్, పింపల్‌కుట్టి మీదుగా, సికింద్రాబాద్-దానాపూర్, దానాపూర్-సికింద్రాబాద్ (12791/12792) రైళ్లను జూన్ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్-సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. మరో తొమ్మిది రైళ్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయి.