మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (19:23 IST)

ఏకాభిప్రాయంతో గణేష్ ఉత్సవాలు: మంత్రి తలసాని

కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఏకాభిప్రాయంతో నిర్వహించేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. కరోనా నేపధ్యంలో ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై సమావేశంలో పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. 

ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, DGP మహేందర్ రెడ్డి,  మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్,దేవాదాయ శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం  హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, విగ్రహాల ప్రతిష్ట నుండి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సుమారు లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని వివరించారు.

ప్రభుత్వం ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తుందని, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాలు చర్చించడం కోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని, దానిని దృష్టిలో ఉంచుకొని 4 రోజులలో మరో సమావేశం నిర్వహించిన అనంతరం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.