తెలంగాణలో గుడికో గోమాత ప్రారంభ కార్యక్రమం
గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గోవు కు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందనీ, గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆయన తెలంగాణాలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీటీడీ కి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని ఆయన కోరారు.
హిందూ ధర్మంలో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారనీ అందుకే గోవును గోమాత అంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ విజయవాడ శ్రీ కనక దుర్గ ఆలయంలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రెండవ విడతగా ఈ రోజు తెలంగాణ లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.
రాబోయే రోజుల్లో కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు.
హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అందజేస్తుందన్నారు.
గోదానం పొందిన ఆలయాలు, పీఠాలు, వేదపాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఎస్వీ గోసంరక్షణశాల అనుమతితో భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందని వైవి చెప్పారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు గోవింద హరి, శివ కుమార్, డివి పాటిల్, స్థానిక సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.