శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (23:10 IST)

తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడు ఎవరు?

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణా పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశాడు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రారంభించింది. 2023 శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా టిఆర్‌ఎస్‌,బిజెపిలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నాయకుడ్నే పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

పిసిసి అధ్యక్షుడి పదవితోపాటు ఇతర పదవులు, జిల్లా, పిసిసి కార్యవర్గాల నియామకాలపైన అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఎన్నికలకు పార్టీని పూర్తిస్థాయిలో ఇప్పటి నుంచే సన్నద్దం చేసేలా కొత్త టీమ్‌ను ఎంపిక చేయబోతున్నామని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరా అనే చర్చ మళ్లీ మొదలైంది. పోటీలో ఐదాగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

పార్టీలో సీనియర్‌ నేత, ఎంపి కొమటరెడ్డి వెంకట రెడ్డి, మరో ఎంపి, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు ప్రధానంగా రేస్‌లో ఉన్నారు. అయితే వీరందరిలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పార్టీలో సీనియర్‌ నేత అయిన కోమటిరెడ్డి ఎఐసిసి నేతలను కలిసి పిసిసి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కోరారు.

ఈసారి కచ్చితంగా తనకు పదవి వస్తుందనే ధీమాలో కోమటిరెడ్డి ఉన్నారు. మరోవైపు ప్రజల్లో ఛరిస్మా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌గాంధీ కోటరీలో ఉన్న రేవంత్‌రెడ్డి అటువైపు నుంచి లాబీయింగ్‌ చేసుకుంటున్నాడు. మరోవైపు ఎఐసిసి నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. టిఆర్‌ఎస్‌, బిజెపి రెండు పార్టీలనూ సమర్ధవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడ్ని అధిష్టానం ఎంచుకునే నేపథ్యంలో తనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి... పార్టీలో సీనియర్‌ నేత అనే వాదనను ముందుకు తెస్తున్నారు. సుదీర్ఘ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కోమటిరెడ్డి పార్టీలోని ఇతర సీనియర్‌ నేతల ద్వారా ఇదే వాదనను అధిష్టానం ముందుకు తీసుకొస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిగిలిన నేతలు మల్లు, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు కూడా ఇదే వాదనను ముందుకు తెస్తున్నారు. తమలో ఎవరికొచ్చినా ఫర్వాలేదు గానీ రేవంత్‌ రెడ్డికి ఇవ్వకూడదు అన్నట్లుగా వీరు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర నేతలతో దీనిపై చర్చించనుంది. ముందుగా అభిప్రాయ సేకరణకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ను పంపించబోతోంది.