భాగ్యనగరిలో అర్థరాత్రి కుమ్మేసిన వర్షం
హైదరాబాద్ నగరంలో సోమవారం అర్థరాత్రి వర్షం కుమ్మేసింది. దీంతో అనేక ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది.
దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విధులు ముగించుకుని ఆ సమయంలో తమ ఇళ్లకు పయనమైనవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, కోఠి, పాతబస్తీ, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్ నగర్, తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.
కోఠిలోని ఓ రహదారిపై ప్రవహించిన వరద నీటిలో ఓ ద్విచక్రవాహనదారుడు కొట్టుకునిపోయాడు. మలక్ పేట వంతెన దిగువున నడుము లోతులో నీరు చేరిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఎల్బీ నగర్ పరిధిలో చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ళలోతులో నీర నిలిచింది.