సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 మే 2021 (18:12 IST)

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి..

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. దట్టంగా ఆవరించన మేఘాలతో పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి. 
 
జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్‌, సికింద్రాబాద్‌లో వర్షం పడుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాల్ని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్‌ జిల్లా పరిగి, సిద్దిపేట, గజ్వేల్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. 
 
అలాగే పంజాగుట్ట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, చాదర్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, మాదన్నపేట, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్, బండ్లగూడా జాగీర్లతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
 
నగరంలో పడిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
 
ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
 
డిజాస్టర్ బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు పర్యటించాలని లోకేష్ కుమార్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.