గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (13:21 IST)

పసిపాపకు ముద్దు పెట్టిన నర్సు.. సోకిన కరోనా మహమ్మారి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇదే అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికి నిదర్శనమే 14 యేళ్లలోపు 75 మందికి కరోనా వైరస్ సోకింది. అలాగే 16 యేళ్లలోపు వారు 70 మంది ఉన్నారు. వీరిలో మర్కజ్‌ కాంటాక్ట్‌ లేకున్నాన వైరస్‌ సోకడం గమనార్హం. ముఖ్యంగా, అభంశుభం తెలియని చిన్నారులు ఈ వైరస్ బారినపడటం ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడిన చిన్నారులను కూడా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వారు అక్కడ ఒంటరిగా ఉండలేక అమ్మానాన్నల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరోవైపు, తల్లిదండ్రులు వారిచెంతకుపోలేని పరిస్థితి నెలకొంది. ఇది తల్లిదండ్రులను తీవ్రవేదనకు గురిచేస్తోంది. అంతేకాకుండా, ఈ వైరస్ బారినపడి పలువురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఏడాదిలోపు పిల్లలు మృతి చెందారు. 
 
ఇదిలావుంటే, పెద్దల నిర్లక్ష్యానికి పిల్లలు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నిమ్స్‌కు చెందిన ఓ నర్సు తన ఇంట్లోని మరో బాలుడిని ముద్దు పెట్టుకుంది. అంతే... ఆ బాలునికి కరోనా సోకడంతో తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లో ఉంటున్న వారందరినీ క్వారంటైన్‌ చేశారు.
 
అలాగే, మంగల్‌హాట్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుమారుడు (16 నెలలు) జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స కోసం తల్లిదండ్రులు ఈ నెల 15న నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన నవజాత శిశువులు, ఇతర పిల్లలు ఒకరి తర్వాత మరొకరు వైరస్‌ బారినపడి ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తల్లులకు దూరంగా పిల్లలు పీడియాట్రిక్‌ వార్డులో ఒంటరిగా ఉండలేక పోతున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి చూసి తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి.