భాగ్యనగరిలో కుమ్మేసిన వర్షం - వీధులు జలమయం... కరెంట్ కట్
హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా నగరం ఒక్కసారిగా చల్లబడింది.
నిజానికి గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భాగ్యనగరి వాసులు అల్లాడిపోతున్నారు. అయితే, ఈ భారీ వర్షంతో నగర వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది.
నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.