సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (09:50 IST)

నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్‌ గణేశుడు

భాగ్యనగరిలో వినాయకుడి నిమజ్జనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఇక, నగరంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపైకి గణేశుడిని చేర్చిన నిర్వాహకులు తెల్లవారుజామునే అవసరమైన వెల్డింగ్ పనులను పూర్తిచేసి శోభాయాత్రకు సిద్ధం చేశారు. 
 
మరోవైపు, వినాయకుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మొత్తం 17 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో అందుకు తగిన ఏర్పాట్లుచేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
 
ఇదిలావుండగా, తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్‌ పనులు చేశారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.
 
టెలిఫోన్‌ భవన్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి శోభాయాత్ర సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. 
 
మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది భక్తులకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గణనాథుని నిమజ్జనం ముగినుంది.
 
మరోవైపు, బాలాపూర్ గణేశుడి ఊరేగింపు కూడా ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం బాలాపూర్ చౌరస్తాలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. కాగా, నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులకు జీహెచ్ఎంసీ మాస్కులు పంపిణీ చేస్తోంది.