గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (20:31 IST)

పేరుకు మాత్రమే ఫుడ్ డెలివరీ బాయ్.. కానీ గంజాయిని సరఫరా చేశాడు..

ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు. మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించినా..గంజాయికి బానిసై ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు. చివరికి డెలివరీ బాయ్‌గా మారి గంజాయి విక్రయిస్తూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్‌ కెనడాలో ఎం.ఎస్‌ పూర్తి చేసి... ఫేస్‌బుక్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై జాబ్‌ కోల్పోయాడు. దీంతో ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా మారాడు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలో చేరి.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే దూల్‌పేటలోని గంజాయి విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు.
 
వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌లోని హాస్టల్‌ విద్యార్థులకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన బాలాజీ సింగ్‌ గంజాయితో పాటు మత్తు ద్రావణాన్ని నగరానికి తీసుకొచ్చాడు. 
 
వాటిని ప్యాకెట్లలో నింపి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు బాలాజీసింగ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గర 800 గ్రాముల మత్తు ద్రావణంతో పాటు, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.