బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:40 IST)

'గ్రేటర్ హైదరాబాద్'లో మళ్లీ ఎన్నికలు : ఎందుకో వివరించిన రేవంత్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు అమితాసక్తిని కలిగించాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలు తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ ఫలితాలు ఈ నెల నాలుగో తేదీన వెలువడ్డాయి. ఇందులో ఏ ఒక్క పార్టీకి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా సీట్లు రాలేదు. అంటే, ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే మేయర్ కుర్చీ దక్కుంది. దీనికి కారణం మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో తెరాసకు 56 సీట్లు రాగా, బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్ పార్టీకి 2 చొప్పున సీట్లు వచ్చాయి. ఇంతవరకు బాగానేవుంది. కానీ, మేయర్ కుర్చీలో ఎవరు కూర్చోవాలన్న కనీసం 76 డివిజన్లు తప్పనిసరి. 
 
ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషంపై తెరాస మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతూ, జమిలి ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. జమిలి ఎన్నికలంటే శాసన, లోక్‌సభలకే కాదని.. జీహెచ్‌ఎంసీకీ ఎన్నికలొస్తాయన్నారు. 
 
అదే జరిగితే ఇప్పుడు గెలిచామన్న ఆనందం కూడా కార్పొరేట్లకు ఉండబోదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచినోళ్లు పదవులు అనుభవిస్తారని అనుకోవాల్సిన పని లేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ల మాటలు చూస్తుంటే స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. పరిణామాలు చూస్తుంటే యేడాది నుంచి రెండేళ్ల పాటు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన రావచ్చన్నారు.
 
ఈ ఎన్నికల్లో భావోద్వేగం పనిచేసిందని ఆయనీ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచినా తెరాసలో చేర్చుకుంటారనే ప్రచారాన్ని సీఎం కేసీఆర్‌ జనాల్లోకి తీసుకెళ్లారని, బీజేపీ సోషల్‌ మీడియా సైతం అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. అందరం కలిసి ఉంటే అధికారులు, మంత్రులు మనం చెప్పిందే చేయాల్సి ఉంటుందన్నారు. మనకు ఓటేసిన వారికి మనం జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని, పార్టీ టికెట్టు ఇచ్చింది కాబట్టి జెండా మోయాల్సిన బాధ్యతా ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.