1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

భార్యను గొడ్డలితో నరికి... రాత్రంతా అక్కడే కూర్చున్న భర్త... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సోమవారం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని వెల్గటూరు మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (45) ముంబైలో కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య సుజాత(37), పన్నెండేళ్ల వయసులోపు ఇద్దరు మగపిల్లలతో కలిసి చర్లపల్లిలోనే ఉంటోంది. 
 
శంకరయ్య అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను వచ్చిన ప్రతిసారీ పూటుగా మద్యం తాగి ఆమెతో గొడవ పడేవాడు. మల్లన్న దేవుని పట్నాల మొక్కుల కోసం రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, అప్పట్నుంచి అక్కడే ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో పలుమార్లు భార్యతో గొడవపడ్డాడు. సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు భార్య స్నానాల గదిలోకి వెళ్లడాన్ని గమనించి బయటే మాటువేశాడు. ఆమె బయటికి రాగానే గొడ్డలితో దాడిచేశాడు. తల, మెడ, చేతులపై విచక్షణరహితంగా నరికాడు. 
 
తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది. శంకరయ్య ఉదయం వరకు మృతదేహం పక్కనే కూర్చుండిపోయాడు. ఉదయం నిద్రలేచిన పిల్లలు జరిగిన ఘోరాన్ని చూసి హతాశులయ్యారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.