బీఆర్ఎస్ పార్టీలో చేరిన యాంకర్ కత్తి కార్తీక
బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ కత్తి కార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కత్తి కార్తీక బీఆర్‌ఎస్‌లో చేరారు.
హరీశ్‌రావు ఆమెకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై హరీశ్ రావు మండిపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భరోసా లేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో బలహీనత ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక దివాళా తీసిందన్నారు. కరెంటు కోతలతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు నమ్మవద్దని, తెలంగాణను వారి చేతుల్లో పెట్టవద్దని కోరారు.
కత్తి కార్తీక గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో కూడా ఆమె ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కత్తి కార్తీక గులాబీ పార్టీలో చేరారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు కత్తి కార్తీకకు సూచించారు.