మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (18:00 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్‌కు షాక్... బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి

palvai sravanthi
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసిపోయింది. దీంతో అభ్యర్థుల తమతమ గెలుపు అవకాశాల కోసం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పార్టీని వీడియారు. ఆమె పార్టీ టిక్కెట్‌ను ఆశించారు. ఆమెకు టిక్కెట్ లభించకపోవడంతో పార్టీకి టాటా చెప్పేశారు. 
 
శనివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట ఉండొద్దని అప్పట్లో తన తండ్రి చెప్పేవారని అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడంలేదని, పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వారిని గుర్తించకుండా కొత్తగా పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్‌లోకి రావడం సంతోషంగా ఉందన్న స్రవంతి.. పదవుల కోసం బీఆర్ఎస్‌లో చేరలేదని స్పష్టంచేశారు. తనతో పాటు తన కార్యకర్తల భవిష్యత్తును మంత్రి కేటీఆర్ చేతుల్లో పెడుతున్నట్లు వివరించారు.
 
ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో మరోమారు కేసీఆర్ సర్కారే ఏర్పడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట గతంలో ఎలా ఉందో ఇప్పుడెలా మారిందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. పాల్వాయి స్రవంతి చేరికను బీఆర్ఎస్ తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.