సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (20:21 IST)

మిస్టర్ కేసీఆర్.. అందర్నీ బకరా చేశాడు : విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి అంతెత్తున మండిపడ్డారు. మిస్టర్ కేసీఆర్.. అందర్నీ బకరా చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీ అయినప్పటి నుంచి తనను రాజకీయాల్లో లేకుండా చేయాలని కేసీఆర్ అనుకున్నారని ఆరోపించారు. 
 
ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ, 1998 నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, బీజేపీలోనే ఉండి తెలంగాణ కోసం పోరాడానని గుర్తుచేశారు. తెలంగాణను టీడీపీ వ్యతిరేకించడంతో ఆ పార్టీకి భాగస్వామిగా ఉన్న బీజేపీ నుంచి అప్పుడు బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.
 
ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించానని... ఆ తర్వాత కేసీఆర్ దొరగారు వచ్చారన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడని చెప్పారు. ఉద్యమంలో దూకుడుగా వెళ్తున్న తనను తెరాసలో కలుపుకోవడానికి కేసీఆర్ ఎంతో ప్రయత్నించాడని విజయశాంతి అన్నారు. 
 
తాను ఒప్పుకోకపోవడంతో తనపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించాడని... తప్పని పరిస్థితుల్లో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో కలపాల్సి వచ్చిందని చెప్పారు. తన కంటే కేసీఆర్ గొప్ప నటుడన్నారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీపై పోటీ చేయాలని కోరాడని తెలిపారు.
 
కేసీఆర్‌కు చెప్పే తాను రాజశేఖర రెడ్డిని కలిశానని... అయితే, తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేశారని విజయశాంతి మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్తే అక్కడ తనను బండ బూతులు తిట్టించాడని, చివరకు 2013లో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాడని విమర్శించారు.
 
పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టినప్పుడు తాను మాత్రమే ఉన్నానని, ఆ రోజు కేసీఆర్ లేడని విజయశాంతి గుర్తుచేశారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేశాడని దుయ్యబట్టారు. 
 
అమాయకులైన తెలంగాణ ప్రజలు ఇంతవరకు కేసీఆర్ ను నమ్మారని... ఇకపై నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు కరెక్ట్ పార్టీ వచ్చిందని, ఇకపై కేసీఆర్ ఉండడని విజయశాంతి జోస్యం చెప్పింది. కేసీఆర్‌కు ప్రతి దానికి డబ్బులు కావాలని... డబ్బులు ఏం చేసుకుంటావు దొరా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం చనిపోయిన వారి శవాల మీద కూర్చొని కేసీఆర్ పాలిస్తున్నాడని రాములమ్మ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.