శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (22:02 IST)

అసదుద్దీన్ అలా చేస్తానంటే కెసిఆర్ ఒప్పుకుంటారా?

ఇప్పుడు జిహెచ్ఎంసి మేయర్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మధ్దతు ఇవ్వకపోవడం.. అది కాస్త హంగ్‌గా మారడమే ప్రధాన కారణం. మొత్తం 150 డివిజన్లలో మ్యాజిక్ ఫిగర్ 102 సీట్లు. అంటే మేయర్ పదవి కావాలంటే ఒక పార్టీకి అన్ని సీట్లు రావాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏ పార్టీకి లేదు.
 
టిఆర్ఎస్‌కు 55, బిజెపికి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు వచ్చాయి. అసలు బిజెపి నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు పాకడమే కాదు, 11 చోట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. అంటే.. దాని బలం సుమారుగా 59 చోట్లున్నట్లేనన్నమాట. ఇపుడు దీనిపైనే పెద్ద చర్చే నడుస్తోంది. ఇక టిఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా ఆ పార్టీ నేతల్లో మాత్రం నిరుత్సాహం కనిపిస్తోంది. ఎంఐఎం మాత్రం బాగానే సీట్లు సంపాదించింది.
 
కానీ వారే ఇప్పుడు కీలకంగా మారారు. అసదుద్దీన్ ఒవైసీ ఎవరితో జత కడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ముందు నుంచి బిజెపిని శత్రువుగా భావిస్తున్నారు ఎంఐఎం నేతలు. అందుకే ఆ పార్టీతో కలిసే అవకాశం ఏమాత్రం లేదంటున్నారు విశ్లేషకులు. ఇక మిగిలింది టిఆర్ఎస్.
 
టిఆర్ఎస్‌తో కలిస్తే మేయర్ పదవిని ఎంఐఎం డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కెసిఆర్ ఒప్పుకునే అవకాశం తక్కువే. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ ఉంది. కాబట్టి హైదరాబాద్ లోను తమ పార్టీ జెండానే ఎగరాలన్నది కెసిఆర్ ఆలోచన. మరీ అసదుద్దీన్ నుంచి ఒత్తిడి వస్తే చేసేది లేక చెరో రెండు సంవత్సరాలు మేయర్ పదవిని పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.