ఆ సత్తా కేసీఆర్ ఒక్కరికే వుంది: ఎంఐఎం నేత అసదుద్దీన్ పొగడ్తలు
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెరాస, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసి మాట్లాడారు. రాష్ట్రంలో భాజపాను ఎదుర్కోవాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. దక్షిణాదిన గొప్ప భవిష్యత్ వున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు అంతులేని గౌరవమనీ, కాంగ్రెస్ పార్టీ, తెదేపా బలహీనమైపోవడం వల్లనే భాజపాకి ఓట్ల శాతం పెరిగిందనీ, ఈ ప్రభావం భవిష్యత్తులో ఏమాత్రం వుండదన్నారు. ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు వుండబోదన్నారు.
భాజపా ప్రధాన నాయకులు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పర్యటించిన ప్రాంతాల్లో భాజపా చిత్తుగా ఓడిందన్నారు. వారి ప్రభావం తెలంగాణలో లేదన్నారు. తమ పార్టీకి ముస్లింలు, హిందువులు అందరూ ఓట్లు వేసారన్నారు. జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటి మేయర్ పదవుల వ్యవహారంపై తెరాస అధినేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.