గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (11:56 IST)

కేసీఆర్‌పై టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. మెదడు దెబ్బతిన్నట్లుంది..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల కొందరికి ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటూంటే కేసీఆర్‌కు మాత్రం మెదడు దెబ్బతిన్నట్లుందని అన్నారు. 2015లో ఆయన ఆమోదంతోనే తెలుగు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్న విషయం గుర్తులేకపోతే తెలంగాణ విభజన అంశం కూడా మరచిపోతే బాగుండేదని ఎద్దేవా చేశారు. 
 
నవరసాలు పండించగల కేసీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని టీజీ వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వెంకటేశ్... రాయలసీమకు గండి కొట్టాలని చూస్తే తెలంగాణ ఎత్తిపోతలన్నీ ఎత్తిపోతాయని హెచ్చరించారు. 
 
వైఎస్‌ హయాంలో మంత్రులుగా ఉన్న చాలా మంది ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ మంత్రులుగా ఉన్నారని, శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్‌ ప్రాజెక్టు అవునో కాదో వాళ్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. శ్రీశైలం విద్యుదుత్పత్తి ప్రాజెక్టు అయితే ఇరిగేషన్‌ కోసం నీళ్లను ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు.
 
పోతిరెడ్డిపాడు నుంచి 845 అడుగుల నుంచి తప్ప నీళ్లు అందవని, అక్కడి వరకు రాకమునుపే నీళ్లను తోడేసి కిందకు వదిలేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టేందుకే కేసీఆర్ జల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీజీ వెంకటేశ్ ఆరోపించారు.