శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:37 IST)

నేను హరీష్ అన్న వర్గం.. నాలాగే ఎంతోమంది రెడీగా వున్నారు: కొండా సురేఖ

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ వర్గాల మధ్య పోరు మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాజీ

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ వర్గాల మధ్య పోరు మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. 
 
టీఆర్ఎస్‌లో తాను హరీశన్న వర్గమని.. తనలాగే ఆయనకు మద్దతు పలికేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా హరీష్ రావుకు పార్టీలో, ప్రభుత్వం తగ్గిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. 
 
ఇటీవల కొంగరకలాన్ బహిరంగసభలో హరీశ్‌రావును పట్టించుకోకపోవడం టీఆర్ఎస్‌లో పెద్ద చర్చకు కారణమైంది. ఇంకా సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇబ్రహీంపూర్‌లో జరిగిన సభలో హరీశ్ రావు రాజకీయ రిటైర్మెంట్‌పై చేసిన ప్రకటన కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. తాను అందరి ఆదరణ, అభిమానం ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలని హరీష్ రావు కామెంట్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసిన మాటలేనని హరీష్ చెప్పినా.. వేరేదో కారణం వుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. టికెట్ దొరకని అభ్యర్థులను పక్కకు లాగి హరీశ్ రావు తన గ్రూప్‌ను సిద్దం చేసుకుంటున్నారని..త్వరలోనే పార్టీలో చీలిక తెస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి.