ముందస్తు ప్రకటన లేకుండా ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను ఆ సంస్థ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రద్దు చేసింది. దీంతో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాలు రద్దు చేస్తే ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ వారు ఎయిరిండియా అధికారులను నిలదీశారు.
ఈ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి, బెంగుళూరు, మైసూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎయిరిండియా సంస్థ విమాన సర్వీసులను నడుపుతుంది. అయితే, ఆ సంస్థ సోమవారం ఉన్నట్టుండి ఈ ప్రాంతాలకు సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే, ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన యాజమాన్యం.. టికెట్ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.