వదిన ఫోన్ నెంబరును ఆన్‌లైన్‌లో పెట్టాడు..ఇంట్రెస్టు ఉన్నవారు కాల్ చేయండి!
వదినను, అన్నయ్యను ఓ యువకుడు వేధించాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు కక్ష పెంచుకున్న ఓ యువకుడు వదిన నెంబర్‌ను ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా, మార్గుల మండలం, కలకొండకు చెందిన నగిళ్ల యశ్వంత్ తన బంధువు (వరుసకు వదిన) భర్త వద్ద రూ.2వేలు అప్పు తీసుకున్నాడు.
డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ విషయం ఆమె యశ్వంత్ అమ్మానాన్నలకు చెప్పింది. దాంతో తల్లిదండ్రులు అతడిపై కోప్పడ్డారు. అది మనసులో పెట్టుకున్న యశ్వంత్ ఎలాగైనా వదిన, ఆమె భర్త పరువును బజారుకీడ్చాలని కుట్ర పన్నాడు.
వదిన మొబైల్ నంబర్‌ను షేర్ చాట్ అప్లికేషన్‌లో పోస్టు చేశాడు. 'హాయ్..! ఐయామ్ ఆంటీ.. నాకు పెళ్లయింది ఒక కొడుకు ఉన్నాడు. మా ఆయన వేస్ట్ ఫెలో. ఇంట్రెస్టు ఉన్నవారు కాల్ చేయండి' అని మెసేజ్‌లు పోస్టు చేశాడు.
దాంతో పోకిరీలు, ఆకతాయిలు రాత్రి, పగలు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. దాంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.