గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (12:35 IST)

పోస్ట్ కోవిడ్ సమస్యలు.. 2 నెలల్లో పెళ్లి.. టెక్కీ మృతి.. రూ.50లక్షలకు పైగా ఖర్చు!

కరోనా సోకి ఇబ్బందులు పడే కంటే.. కోవిడ్ రాకుండా జాగ్రత్త పడటమే మేలు. లేదంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రాణాలు హరించుకుపోతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కరోనా సోకడంతో వైద్య చికిత్స అందించుకోవడం ఓ ఎత్తైతే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరో ఎత్తు. అందుకే కోవిడ్ మహమ్మారికి దూరంగా వుండటం ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు నొక్కి చెప్తున్నారు. 
 
తాజాగా యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పోస్ట్ కోవిడ్ సమస్యలు బలితీసుకున్నాయి. అమెరికాలో స్థిరపడ్డ యువతి.. పెళ్లి కోసం స్వదేశానికి వచ్చింది. ఈ క్రమంలో కరోనా బారిన పడింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆపై వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆమె మృతి చెందింది. ఈ విషాద ఘటన తెలంగాణ, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన పెండ్యాల రవీందర్‌రెడ్డి కుమార్తె నరిష్మరెడ్డి(28). హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నరిష్మ స్థిరపడ్డారు.
 
అయితే మే నెలాఖరులో పెళ్లి ఉండటంతో రెండు నెలల కిందటే అమెరికా నుంచి వచ్చారు. పనిమీద చెన్నై వెళ్లి వచ్చిన అనంతరం కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అనంతరం ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపటంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 40 రోజులకుపైగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు. చికిత్స కోసం రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశామని.. అయినా ప్రాణం దక్కలేదని నరిష్మ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.