మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (08:24 IST)

తెలంగాణలో విద్యావిధానం ప్రక్షాళనకు చర్యలు

ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సైతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నా సమస్యలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు భారీగానే ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో శిథిల పాఠశాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. కొత్తగా చేపడుతున్న బయోమెట్రిక్‌ హాజరుపై గుర్రుగా ఉన్నారు. కొత్త పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనేక ఆశలు పెట్టుకున్నారు.
 
సంక్లిష్ట సమయంలో బాధ్యతలు..
ప్రభుత్వం గతంలో విద్యాశాఖలో ఉన్న అనేక విభాగాలను కుదించింది. పాఠశాల విద్య, ఇంటర్‌ విద్య, ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యాశాఖలను ఒకటిగా చేసింది. వీటన్నింటికి ప్రస్తుతం ఒకరే మంత్రిగా ఉంటున్నారు. ఇటీవల ఇంటర్‌ పరీక్షలలో చోటుచేసుకున్న తప్పిదాల కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల వల్ల ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే హైకోర్టు నుంచి ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ రావడంతో ఊపిరిపీల్చుకుంది. ఇకపోతే విద్యాశాఖలో ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్‌ విధానంతో పాటు కొత్తగా రూపొందించిన యాప్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతు న్నాయి. మరోవైపు సీపీఎస్‌ పింఛన్‌ విధానంపై కూడా ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని వెల్లడించలదు. విద్యాశాఖ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే సబితారెడ్డి ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 
గురుకులాల్లో వసతుల కరువు..
ఇటీవల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. గత జూన్‌లో మొదలైన విద్యా సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించింది. అన్ని సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటికితోడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో సీటు దొరకడం కష్టంగా మారింది. అంతగా వీటికి డిమాండ్‌ ఉంది. ఈ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అయినా చాలా వరకు గురుకుల పాఠశాలల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేదు. విద్యార్థులు చాలీచాలని సౌకర్యాలతో కాలం గడుపుతున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలలో గురుకులాలను ప్రారంభించారు. వాటిలో సరిపడా గదులు లేక ఒకే గదిలో బోధన.. వసతి కల్పించారు. కొన్ని చోట్ల తీవ్ర నీటి ఎద్దడి విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలను చక్కదిద్దాల్సిన బాధ్యత కొత్త విద్యాశాఖ మంత్రిపై ఉంది.
 
సమస్యల నిలయంగా పాఠశాలలు
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. జిల్లాలో వెయ్యి వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 160 పాఠశాలల భవనాలు శిథిలమైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలోనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లలో దాదాపు లక్షమంది విద్యార్థులు చదవుకుంటున్నారు. ఇక జిల్లాలోని దాదాపు 220 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల కొందరు ఉపాధ్యాయులు విధుల్లో చేరడంతో పరిస్థితి కొంత మేరకు చక్కబడింది. జిల్లాలో దాదాపు 1400 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యా వలంటీర్లను విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం విద్యా వలంటీర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. పాఠశాలల విలీనంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. పాఠశాల విద్యలోని ఈ సమస్యలను కొత్త విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎలా పరిష్కరిస్తారో అనే ఆసక్తిగా మారింది. ఇంటర్‌ విద్యకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో భవనాల కొరత తీవ్రంగా ఉంది. కొత్త భవనాల మంజూరు లేకపోవడంతో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలలోనే ప్రభుత్వ కాలేజీలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను ప్రారంభించాలనే డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం మాత్రం కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుకూలంగా లేదు. ఇకపోతే ఇంటర్‌ విద్యలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సమస్యల సాధనకు ఉద్యమాలు చేస్తున్నారు. గత కొద్ది మాసాలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిని కూడా కొత్త విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పరిష్కరించాల్సి ఉంది. పలు ప్రాంతాలలో నిర్మిస్తున్న పాఠశాల, కళాశాలల భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఏళ్ల తరబడి ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పాఠశాలల భవనాల నిర్మాణం పూర్తి అయితే హాస్టల్‌ భవనాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో విద్యార్థులకు వసతి సమస్య ఎదురవుతోంది. ముఖ్యంగా ఆదర్శ పాఠశాలల విషయంలో ఈ సమస్య అధికంగా ఉంది. కొన్ని చోట్ల ప్రభుత్వ జూనియర్‌..డిగ్రీ కళాశాలల భవనాల నిర్మాణం కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం కూడా నత్తనడకన సాగుతోంది. రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్న భవనాల నిర్మాణంపై కూడా కొత్త విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.