శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:20 IST)

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు.. తమిళిసై నియామకంపై అసలు రహస్యం..?

తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీకి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌ను నియమించింది. తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ బదిలీ అయినా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు తొమ్మిదేండ్ల తొమ్మిది నెలల సుదీర్ఘ సేవలు అందించారు. అనేక రాజకీయ పరిణామాలకు సాక్షిగా నిలిచారు. తెలంగాణతో పెనవేసుకున్న అనుబంధంతో ఏపీతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. 
 
ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నరసింహన్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. రాష్ట్రం విడిపోయినా విభజన సమస్యల మీద ఆయనకు ఉన్న సంపూర్ణమైన అవగాహన నేపథ్యంలో కేంద్రం ఆయన్నే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగించింది. ముందుగా యూపీఏ -2 ప్రభుత్వంలో ఆయన గవర్నర్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన్ను బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు వెల్లడించింది. 
 
ఇకపోతే.. తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌రాజన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణపై మరింత పట్టుకోసం కేంద్రంలోని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమ పార్టీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సౌందర్ రాజన్‌ను నియమించినట్టు తెలుస్తోంది. 
  
అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్రం మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణకు తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజస్థాన్‌కు కల్‌రాజ్‌ మిశ్రా, మహారాష్ట్రకు భగత్‌సింగ్‌, కేరళకు మహ్మద్‌ ఖాన్ కొత్త గవర్నర్లుగా నియమితులయ్యారు.