శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

మిషన్​ భగీరథ దేశవ్యాప్తంగా అమలుచేస్తాం: కేంద్రమంత్రి

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్‌తో కేంద్ర జల్​ శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశమయ్యారు. మిషన్ భగరీథ గురించి ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి సీఎం, అధికారులు వివరించారు.

మిషన్ భగీరథ తరహాలో దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉందని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వివరాలను ఆయన తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్​తోపాటు అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇది శాశ్వత పరిష్కారం.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీటిఎద్దడి, ఫ్లోరైడ్ సమస్య ఉండేదని... కొన్నిచోట్ల తాగునీరే దొరికేది కాదని, దొరికినా పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారని ముఖ్యమంత్రి వివరించారు.

సమస్య పరిష్కారం కోసం గోదావరి, కృష్ణా జలాలను శుద్ధిచేసి 24వేల ఆవాసాలకు ప్రతిరోజూ అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టామని... పథకం దాదాపు పూర్తైందని చెప్పారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు మహిళలకు ఇబ్బందులు తప్పాయని, వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయని సీఎం తెలిపారు.

రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును రూపొందించామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం దేశమంతా అమలైతే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దని అన్నారు.

దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సాధిస్తోందని కేసీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించారు.

11వ శతాబ్దంలోనే కాకతీయలు తవ్వించిన వేలాది చెరువులు సమైక్య పాలనలో నాశనమయ్యాయన్న ముఖ్యమంత్రి... 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేశామని చెప్పారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్... ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

మంచినీటి పథకాల అమలుతోపాటు, మురుగు నీటిని శుద్ధిచేసి తిరిగి ఉపయోగించే విధానాలు అవలంభించాలని సూచించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించారు. త్వరలోనే మరోమారు తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో పథకాల అమలును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.