బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:52 IST)

హైదరాబాద్ నగరంలో పాడె మోసిన ముస్లింలు

హైదరాబాద్ నగరంలో ముస్లింలు మానవత్వాన్ని ప్రదర్శించారు. క్షయ వ్యాధితో చనిపోయిన ఓ ఆటో డ్రైవర్‌కు అంత్యక్రియలు చేశారు. ముఖ్యంగా, మృతి చెందిన ఆటో డ్రైవర్‌ పాడి మోసేందుకు ఇరుపొరుగువారు రాకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన ముస్లింలు పాడె మోసి మానవత్వాన్ని ప్రదర్శించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఖైరతాబాద్‌కు చెందిన వేణు ముదిరాజ్ ఓ ఆటో డ్రైవర్ (50). గత కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. దీంతో ఆయనకు వ్యాధి ముదరడంతో వేణు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 16న మరణించాడు. అతడి భార్య ఎప్పుడో చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
అయితే, ఇరుగుపొరుగు వారు మాత్రం వేణు కరోనాతో చనిపోయాడని భావించి అతడి మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. సాయం చేసేందుకు నిరాకరించారు. వేణు పిల్లల వద్ద అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కూడా లేదు. 
 
ఈ విషయం తెలిసిన సాదిక్ బిన్ సలామ్ అనే ముస్లిం సామాజిక కార్యకర్త తన నలుగురు మిత్రులైన మాజిద్, ముక్తాదిర్, అహ్మద్, ఖాసిమ్ లకు సమాచారం అందించాడు. వెంటనే వారందరూ అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హిందూ శ్మశానవాటిక వరకు పాడె మోసి వేణు అంత్యక్రియలు జరిపించారు.