బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:32 IST)

ఇక క్వారంటైన్ 14 రోజులు కాదు.. 28 రోజులు : మేయర్ బొంతు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో క్వారంటైన్ సమయాన్ని 14 రోజుల నుచి 28 రోజులకు పెంచుతున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'ఇకపై కరోనా అనుమానితులు కనీసం 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. 14 రోజుల్లో లక్షణాలు బయటపడకుంటే కరోనా లేనట్టు కాదు. ఆ తర్వాత కూడా వైరస్‌ బయటపడే ప్రమాదం ఉందన్నారు.
 
నగరంలో వెలుగు ఈ తరహా కేసులు అనేకం వెలుగు చూశాయని చెప్పారు. బయటకు వెళ్లకుండా ఉండడంతో పాటు ఇంట్లోనూ దూరం పాటించాలి అని చెప్పుకొచ్చారు. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన ఓ జంట.. 14 రోజులు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారని, పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో ఇంటికి వెళ్లిన అనంతరం వారి ఆరేళ్ల బాబుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని గుర్తుచేశాడు. 
 
అందువల్ల, ప్రభుత్వ/హోం క్వారంటైన్‌లో 14 రోజులున్న వారు.. ఆ తర్వాత కూడా రెండు వారాలు బఫర్‌ క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో సహా ఎవరినీ కట్టడి ప్రాంతాల నుంచి బయటకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
 
నగరంలో ఇప్పటికే 45 వేలకు పైగా వాహనాలు సీజ్‌ చేసినా.. ప్రజలు ఇష్టానుసారం బయటకు వస్తున్నారని చెప్పారు. ఇలాగే ఉంటే కరోనా చైన్‌కు అడ్డుకట్ట వేయలేమని, లాక్‌డౌన్‌ పొడిగించాల్సి రావచ్చన్నారు. హాస్టళ్లలో ఉన్న వారిని ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయకుండా నిర్వాహకులు సహకరించాలని మేయర్‌ బొంతు కోరారు.