సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:10 IST)

భార్యలను వేధించే భర్తలకు తగిన శాస్తి.. క్వారంటైన్‌కు తరలిస్తారట!

భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యలకు ఊరట కల్పించేలా మహారాష్ట్ర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో భార్యలు, మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయించింది.

లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ భర్తల చేతిలో గృహహింసకు గురవుతున్నారనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పుణే జిల్లాపరిషత్‌ సీఈఓ ఆయుష్‌ ప్రసాద్‌ తెలిపారు. మద్యం షాపుల మూసివేతతో దిక్కుతోచని స్ధితిలో పురుషులు ఈ ఉన్మాదానికి తెగబడుతున్నారని వెల్లడించారు. 
 
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో మహిళలపై గృహ హింస కేసులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్‌ గణాంకాలు వెల్లడించిన నేపథ్యంలో పుణే జిల్లా పరిషత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉన్నందున వారిని భర్తలు ఎవరైనా వేధిస్తే నిందితులను క్వారంటైన్‌కు పంపుతామని ప్రసాద్‌ హెచ్చరించారు. 
 
తొలుత కౌన్సెలర్లు, పోలీసుల సాయంతో నచ్చచెపుతామని, అయినా భర్తల ప్రవర్తనలో మార్పు రాకుంటే క్వారంటైన్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం తాము పంచాయితీ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి ఇంటింటికీ వెళ్లి వాకబు చేయిస్తామని చెప్పారు.