శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (12:55 IST)

రైతులంతా బ్రోకర్లే : తెలంగాణ బీజేపీ ఎంపీ వెకిలి మాటలు

దేశానికి అన్నం పెట్టే రైతన్నలంతా బ్రోకర్లేనట. రైతే రాజు.. రైతు లేనిదే దేశం లేదంటూ నిన్నామొన్నటివరకు ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతలు ఇపుడు... రైతులంటే చులకనగా చూస్తున్నారు. ఇపుడే ఏకంగా రైతులను బ్రోకర్లుగా మార్చేశారు. రైతులను బ్రోకర్లతో పోల్చిన ఘనాపాటీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీగారే. ఆయన పేరు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈయన సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై పోటీ చేసి గెలుపొందారు. ఈయనగారే రైతులను బ్రోకర్లతో పోల్చారు. రైతులు చేస్తున్న ఉద్యమం కమిషన్ ఉద్యమం అంటూ కితాబిచ్చారు. ఇటీవల కేంద్రం మూడు వ్యవసాయచట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు రైతులకు తీరని నష్టం చేస్తాయన్న ఆరోపిస్తూ గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం భారత్ బంద్ కూడా నిర్వహించారు. ఇది విజయవంతమైంది. 
 
దీనిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఈ పిచ్చికూతలు కూశారు. రైతు రక్తాన్ని పీల్చి కార్పొరేట్‌కు అప్పజెప్పే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నందుకు, ఢిల్లీలో ఆందోళన చేసే రైతులంతా బ్రోకర్లు అంటూ దారుణంగా అవమానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆందోళన చేస్తున్నది నిజమైన రైతులు కాదని, వారంతా దళారులంటూ మండిపడ్డారు. కమీషన్‌ ఏజెంట్ల ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనలకు ప్రభుత్వం ఇలాగే అండగా నిలబడితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరించారు. 
 
ఉద్యమం అంటే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో కేసీఆర్‌ చూస్తారని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందా? అని సవాల్‌ విసిరారు.
 
ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తెరాస మంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను బ్రోకర్లుగా అభివర్ణించడం నిజామాబాద్‌ ఎంపీ అహంకారానికి నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 
 
హక్కులకోసం, న్యాయం కోసం ఉద్యమిస్తున్న రైతులను చులకన చేసి మాట్లాడటం హేయమని ధ్వజమెత్తారు. పసుపుబోర్డు పేరుతో గెలిచి రైతులను నయవంచన చేసిన వ్యక్తికి రైతులు బ్రోకర్లుగానే కనిపిస్తారని, ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్య లు ఆయన పతనానికి ప్రారంభమని హెచ్చరించారు.