ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:28 IST)

జగిత్యాలలో ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంద్.. ఎందుకు?

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ విక్రయాన్ని బంద్ చేశారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని లేనిపక్షంలో పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా యంత్రాంగం కఠినమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో హెల్మెట్ లేని వాహనదారులు  తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 
 
ఇటీవలి కాలంలో ఈ జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌ ధరించని వాహన దారులు ప్రమాదాల్లో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 
 
ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, జిల్లా కలెక్టర్‌ రవి ఆదేశాలతో అధికారులు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు ‘నో హెల్మెట్‌- నో పెట్రోల్‌’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీనిపై ఇటీవలే జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం జిల్లాలోని బంకు యజమానులు, అధికారులకు నిబంధలనపై పూర్తి అవగాహన కల్పించారు. 
 
దీనికి తోడు జిల్లా సివిల్‌ సప్లై అధికారి చందన్‌ కుమార్‌ తన బృందంతో కలిసి ప్రతి పెట్రోల్‌ బంకులో ‘హెల్మ్‌ట్‌ లేకుండా పెట్రోల్‌ పోయబడదు’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరో వైపు మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులకు సూచించారు. ప్రతి పెట్రోల్‌ బంక్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, ప్రతీ పదిహేను రోజులకొకసారి పెట్రోల్‌ పోసే విధానాన్ని పరిశీలించనున్నారు.