మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (15:40 IST)

సామాన్యుల నడ్డి విరుస్తున్న పెట్రోల్ - డీజిల్ - గ్యాస్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో సెంచరీ కొట్టాయి. ఇపుడు తాజాగా గ్యాస్ ధరను కూడా చమురు కంపెనీలు పెచాయి. ఫలితంగా సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. 
 
గురువారం వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెంచాయి. సవరించిన ధరలు గురువారం నుంచే కొత్త రేట్లు అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 
 
ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.664 ఉండగా.. తాజాగా పెంచిన ధరతో రూ.719కి చేరింది. లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719గా మారగా, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722 రూపాయలుగా, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. 
 
ఇదిలావుంటే, పెట్రోల్‌ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయికి ధరలు చేరగా.. తాజాగా చమురు కంపెనీలు మరోసారి ధరలను పెంచాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.‌
 
తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.65, డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.
 
తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.10, డీజిల్‌ రూ.83.81కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.73, కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, డీజిల్ రూ.80.41, చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04, బెంగళూరులో పెట్రోల్ రూ.89.54, డీజిల్ రూ.81.44 చొప్పున ఉంది. 
 
కాగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను విధించింది. అయినప్పటికీ.. ఈ భారం సామాన్యులపై పడబోదని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోమారు పెంచింది.