1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (08:45 IST)

రామకృష్ణ ఆత్మహత్య కేసు : తెరాస ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేయలేదు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆత్మహత్య కేసులో అధికార తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావును ఏ2 నిందితుడుగా అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలపై ఆ రాష్ట్ర పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వనామా రాఘవేంద్ర రావు ఇంకా పరీరాలో ఉన్నారని, ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. 
 
కాగా, గురువారం సాయంత్రం వనామా రాఘవేంద్ర రావును పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఈ కేసులో అరెస్టు కాకుండా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండవచ్చని, అదే జరిగితే తాము కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేస్తామని తెలిపారు. 
 
మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్నది తెరాస ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఆయన్ను ప్రగతి భవన్‌లోనే దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేంద్రరావును ఏ1గా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమిటరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ మనవడిని ఒక్క మాటంటే గగ్గోలు పెట్టిన ఈ తెరాస నేతలకు, సీఎం కేసీఆర్‌కు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్ళకు కనిపించలేదా అని నిలదీశారు.