తెలంగాణ విద్యార్థులకు వెసులుబాటు... ఆ పని చేసేందుకు ఛాన్స్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసినవారు తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాలేజీ ప్రిన్సిపాళ్ళ ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.
అలాగే, ఫెయిలైన విద్యార్థులను ప్రభుత్వం నిర్ణయం మేరకు పాస్ చేసిన తెలంగాణ బోర్డు మరో ముఖ్య సూచన చేసింది. విద్యార్థులందరూ శుక్రవారం నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి మార్గుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి మార్కుల మెమోలను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.