శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఖమ్మంలో గంజాయి అక్రమ రవాణా : పోలీస్ కానిస్టేబుల్ అరెస్టు

తెలుగు రాష్ట్రాలను అక్రమ గంజాయి రవాణా కుదిపేస్తోంది. ఈ అంశం ఇపుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా కలంకలం రేపుతోంది. 
 
గంజాయి అక్రమ రవాణా సాగుతోందన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 5 కిలోల గంజాయి పట్టుబడింది. 
 
నిందితుల్లో ఒకరు ముదిగొండ మండలం వల్లభికి చెందిన కొండ సతీశ్ కాగా, రెండో వ్యక్తి కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన పోలెబోయిన వెంకటేశ్వర్లు. ఖమ్మంలోని చెరువుబాజర్‌లో ఉంటున్న సతీశ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్టు తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.
 
తన సమీప బంధువైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఈ గంజాయిని కొనుగోలు చేసి వెంకటేశ్వర్లుకు ఇవ్వగా అతడు దానిని సతీశ్‌కు అప్పగించాడు. దానిని మరో వ్యక్తికి అప్పగించేందుకు వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాద్రి కొత్తగూడెంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్, ఖమ్మం జిల్లా జైలులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ నరేందర్‌తోపాటు గంజాయి కొనుగోలు చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నారు. 
 
వారి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.  కాగా, విషయం తెలిసిన ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్.. వార్డర్‌గా పనిచేస్తున్న నరేందర్‌ను సస్పెండ్ చేశారు.