గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (18:37 IST)

ఆర్నెల్ల గర్భిణి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యపై కట్టుకున్న భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లా క‌ల్వా ఏరియాలోగ‌ల మ‌ఫ‌త్‌లాల్ కాల‌నీలో శ‌నివారం సాయంత్రం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌ఫ‌త్‌లాల్ కాల‌నీకి చెందిన అనిల్ బ‌హ‌దూర్ చౌరాసియా అనే వ్యక్తి భార్య ఉండ‌గానే మ‌రో మ‌హిళను పెళ్లి చేసుకున్నాడు. దాంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్ర‌మంలోనే గ‌త నెల 30న అనిల్ బ‌హ‌దూర్ భార్య‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. ఆవేశంతో ఆర్నెల్ల గర్భంతో ఉన్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. మంట‌ల్లో చిక్కుకున్న బాధితురాలి అరుపులు విని అక్క‌డికి చేరుకున్న ఇరుగుపొరుగు ఆమెను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
వెంట‌నే ఆమెను ప‌రీక్షించిన వైద్యులు బాధితురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. కాలిన గాయాల కార‌ణంగా ఆమె క‌డుపులోని బిడ్డ చ‌నిపోవ‌డంతో స‌ర్జ‌రీ చేసి పిండాన్ని తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌నిపై ఐపీసీ సెక్ష‌న్ 307 ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు.