1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:55 IST)

తెలంగాణాలో ఠారెత్తిస్తున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ధరల వివరాలు విని భూమి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల భూ రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 
 
రాష్ట్రంలో సాగు భూముల మార్కెట్ విలువను ఏకంగా 50 శాతం, బీడు భూముల విలువను 35 శాతం మేరకు పెంచింది. అలాగే, బహుళ అంతస్తు భవనాల విలువను రూ.25 నుంచి 30 శాతం పెంచింది. ఈ పెంచిన ధరలు జనవరి 31వ తేదీ అర్థరాత్రి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువకు, ఇపుడు ప్రభుత్వం ప్రతిపాదించిన భూమి విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35 నుంచి 40 శాతానికి పైగానేవుంది. దీంతో భూములు లేదా అపార్ట్ భవనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది.