పెద్దల పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకో: షర్మిలకు రేవంత్ సూచన
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆవేదనతో ఏదో మాట్లాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీల నేతలు మాట్లాడితే తాను స్పందిస్తానని, ఎన్జీవో నడిపేవారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ఎద్దేవాచేశారు.
తెలంగాణ రాజకీయాలతో షర్మిలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్, షర్మిలేనని చెప్పారు. కులపెద్దల మధ్య పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకోవాలని సూచించారు. వైఎస్ ఆస్తులు మాకొద్దు.. మేము వారసులం కాదు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడే అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. రేవంత్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ... నిన్నమొన్న పార్టీ పెట్టిన వాళ్ల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని, షర్మిల ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.