శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (10:53 IST)

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండె నొప్పి... బస్సును ఆపేశాడు...

హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్పూర్తితో పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షేమంగా ఇంటికెళ్లారు. 14 మంది ప్రయాణికులను తీసుకుని వెళుతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు.
 
ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చాక చక్యంగా జాగ్రత్త పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ అంబర్పేట్ ప్రధాన రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తిరిగి వరంగల్ వెళ్తుంది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌ శ్రీనివాస్కు గుండె పోటు వచ్చింది. 
 
ఈ సమయంలో తన కర్తవ్యాన్ని మరచిపోని డ్రైవర్ బస్సును అతికష్టం మీద పక్కకు తీశాడు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎలాంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా రోడ్డు పక్కకు నిలిపి స్టీరింగ్ మీదనే పడిపోయాడు. 
 
డ్రైవర్‌ పరిస్థితిని గమనించిన ప్రయాణికులు, కండక్టర్‌ వెంటనే స్పందించి అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చారు.. అనంతరం అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌ స్వస్థలం అంబర్‌పేట్‌గా తెలిసింది. సమయానికి డ్రైవర్ను హాస్పిటల్ కి తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.