గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2023 (23:13 IST)

రన్నరప్​ కిరాక్ హైదరాబాద్​: ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు

image
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) మొదటి సీజన్​లో కిరాక్‌ హైదరాబాద్‌ రన్నరప్‌‌గా నిలిచింది. లీగ్‌ దశతో పాటు సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన హైదరాబాద్‌ ఫైనల్లో టై బ్రేకర్‌లో పట్టు విడిచింది.  ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో అత్యంత హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 28-30 తేడాతో కొచి కెడిస్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. అండర్‌ కార్డు, మెయిన్ కార్డు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లూ సమంగా నిలిచాయి. టై బ్రేకర్‌లో సత్తా చాటిన కొచ్చి తొలి సీజన్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. సీజన్‌లో అద్భుతంగా పోరాడి రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్​ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు. 
 
అండర్​ కార్డ్‌లో హోరాహోరీ
సెమీస్​ మాదిరిగా ఫైనల్లోనూ అండర్‌ కార్డు మ్యాచ్‌లు హోరీహోరీగా సాగాయి. ఇందులో హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు. మొదటిదైన పురుషుల 60 మ్యాచ్‌లో ఎంవీ నవీన్​ 0-1తో రుద్ర నాయక్​ చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే, స్పెషల్​ కేటగిరీ మ్యాచ్​లో బుట్ట సింగ్​ 1-0తో కొచ్చి ఆర్మ్​ రెజ్లర్​ ఆసిఫ్​ అహెమ్​ను ఓడించి లెక్క సరి చేశాడు. తర్వాతిదైన మహిళల 53 కేజీ మ్యాచ్​లో సవిత కుమారి 1-0తో అభిరామిపై విజయం సాధించి కిరాక్​ హైదరాబాద్‌కు 2-1తో ఆధిక్యం కట్టబెట్టింది. అయితే, అండర్​ కార్డ్‌లో ఆఖరిదైన 100 కేజీల పోరులో జగదీశ్​ 0-1తో ప్రిన్స్ కుమార్​ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో, అండర్‌ కార్డ్‌ రౌండ్‌ను ఇరు జట్లూ 2-2తో ముగించాయి.
 
మెయిన్​ కార్డు చివర్లో తడబాటు​
అండర్​ కార్డ్​ మాదిరిగా మెయిన్​ కార్డ్ లోనూ హైదరాబాద్​కు సరైన ఆరంభం లభించలేదు. కిరాక్​ హైదరాబాద్​ స్టార ఆర్మ్ రెజ్లర్​ మధుర మొదటిదైన 65 కేజీ మ్యాచ్​లో 0–5తో చేతన శర్మ చేతిలో ఓడిపోయింది. దాంతో, హైదరాబాద్​ 2–7తో వెనుకబడింది. తర్వాత జరిగిన పురుషుల 70 కేజీ పోరులో స్టీవ్​ థామస్​ 10–0తో ఆకాశ్​ కుమార్​ను ఓడించడంతో హైదరాబాద్ 12–7తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, 65 ప్లస్​ కేజీ కేటగిరీలో జిన్సీ జోస్​ 0–10తో యోగేశ్​ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో కొచ్చి 17–12తో ముందంజ వేసింది. అయితే, కీలకమైన 80 కేజీ పోరులో హైదరాబాద్​ కెప్టెన్​ అస్కర్​ అలీ 10–0తో ప్రిన్స్​ ధిర్​ను చిత్తు చేయడంతో హైదరాబాద్​ 22–17తో  మళ్లీ ఆధిక్యం సాధించింది. ఆపై, 90 కేజీ పోరులో సిద్దార్థ్​ మలాకర్​ 5–0తో కొచ్చి ఆర్మ్​ రెజ్లర్​ అక్బర్​ షేక్​ను ఓడించడంతో కిరాక్​ హైదరాబాద్​ 27–17తో పది పాయింట్ల ఆధిక్యంలో సులువుగా గెలిచేలా కనిపించింది. కానీ, చివరిదైన ప్లస్​ 100 కేజీల పోరులో ఉజ్వల్​ అగర్వాల్​ 0–10 తేడాతో మజాహిర్​ సైదు చేతిలో ఓడిపోవడంతో స్కోరు 27–27తో సమం అయింది.
 
టై బ్రేకర్‌‌ లో బోల్తా
విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్‌‌లో కిరాక్​ హైదరాబాద్​ సెమీస్​ ఫలితాన్ని పునరావృతంలో చేయలేక నిరాశ పరిచింది. మిక్స్​డ్​ వెయిట్​ కేటగిరీ తొలి పోరులో స్టీవ్​ థామస్​ 1–0తో రుద్ర నాయక్​పై గెలిచాడు.  రెండో పోరులో కెప్టెన్‌ అస్కర్‌ అలీ 0-1తో ముజాహిర్‌ చేతిలో ఓడిపోయాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మధుర 0–1తో చేతన శర్మ చేతిలో, జిన్సీ జోస్ 0–1తో యోగేశ్‌ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో హైదరాబాద్‌ ట్రోఫీని చేజార్చుకుంది.