శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:00 IST)

పాపం రేవంత్...! పీసీసీ రేసులో ఆశాభంగం?

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరింలేదన్న సామెత గుర్తుకు రాకమానదు రేవంత్ రెడ్డి వ్యవహారం గమనిస్తే. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పీసీసీ పీఠం తీసుకోవాలని ఆయన భావిస్తుంటే.. వెనక్కి లాగేవారు బోలెడంతమంది తయారయ్యారు.

నిజానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధ్యక్ష మార్పు ఉంటుందని అందరూ భావించారు. కానీ హైకమాండ్ మాత్రం లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కూడా ఉత్తమ్‌కే అప్పగించి ఆయనపై భరోసా ఉంచింది. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఖాయమన్న ప్రచారం మరోమారు విస్తృతంగా జరిగింది. అయితే ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడ్డ సంక్షోభంతో టీ-పీసీసీ చీఫ్ మార్పు అంశం వెనక్కిపోయింది.

ఢిల్లీ సంక్షోభం ముగిసేవరకు మార్పు ఉండదన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సోనియాగాంధీని ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్న తర్వాత.. కేంద్రస్థాయిలో పార్టీలో నెలకొన్న గందరగోళానికి కొంత తెరపడింది. దీంతో ఇప్పుడు టీ-పీసీసీ పీఠంపై గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనిపై హైకమాండ్ తన మదిలో మాటను ఇప్పటివరకు బయటకు చెప్పలేదు. అయినప్పటికీ రాష్ట్ర నాయకులు మాత్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
 
నిజానికి పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీపడ్డారు. కానీ రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పడంతో ఇక రేవంత్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని భావించారు. ఎప్పుడు మార్పు జరిగినా నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా జరిగింది. కానీ ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలైంది.

ఈ తరుణంలో టీ- కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందట. రేవంత్ పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉండటంతో పార్టీలోని కొందరు సీనియర్లు ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీస్థాయిలో వారు చక్రం తిప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఒక నోట్‌ను తయారుచేసి అధిష్టానం పెద్దలకు వారు సమర్పించినట్టు వినికిడి!
 
కాంగ్రెస్ హైకమాండ్‌కు సమర్పించిన ఆ నోట్‌లో పార్టీ సీనియర్లు కొన్ని విషయాలను గట్టిగానే ప్రస్తావించారట. కొత్తగా పార్టీలో చేరినవారికి పదవులు ఇవ్వడం వల్ల టీ-కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని పార్టీ పెద్దలను హెచ్చరించారట. మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉంటూ.. పార్టీకోసం పనిచేసిన నాయకులకే పదవులు ఇవ్వాలని వారు విజ్ఞప్తిచేశారట. ఇక టీ-పీసీసీ అధ్యక్షుని మార్పు జరిగితే పార్టీలో మొదటినుంచి ఉన్న నాయకుల్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అంటున్నారట.

టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాత్రం తాము పార్టీలో పనిచేయలేమనే సంకేతాలు ఇచ్చారట. ఇక పనిలో పనిగా రేవంత్‌రెడ్డి కూడా జగన్ మాదిరిగానే పార్టీకి తీవ్ర నష్టంచేసే పరిస్థితి ఏర్పడవచ్చునని అభిప్రాయపడ్డారట.
 
అయితే రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపిన నేతలు.. పీసీసీ పీఠం కోసం ఎవరి పేర్లను ప్రతిపాదించారనే విషయంపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పదవికి పోటీలో ఉన్నది ఎవరు? అనే ఆసక్తికర చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో సాగుతోంది.

ప్రస్తుత పీసీసీ చీఫ్ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కాబట్టి.. మళ్లీ అదే సామాజికవర్గం నేతకు అవకాశమిచ్చే పక్షంలో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఆయన సోదరుడు బీజేపీ వైపు చూస్తుండటం వెంకట్‌రెడ్డికి మైనస్‌గా మారిందని కొందరి భావన!

రెడ్డి నేతకే ఆ పదవి ఇవ్వాలనుకుంటే కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి ఇచ్చినా అభ్యంతరం లేదని కొందరు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ పీఠంపై జీవన్‌రెడ్డి అంత ఆసక్తి చూపడం లేదని మరికొందరు చెబుతున్నారు.
 
ఇక టీ-పీసీసీ చీఫ్ పదవికి రేసులో ప్రస్తుతం మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీధర్‌బాబుకి కూడా ఆ పదవిపై అంత ఆసక్తిగా లేదట. అయితే ఆయనకు అత్యంత సన్నిహితులు, పార్టీ సీనియర్ నేతలు సర్దిచెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రీధర్‌బాబు పక్షాన కొందరు సీనియర్ నేతలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దాంతో ప్రస్తుతానికి దుద్దిళ్లనే రేసులో ముందున్నారని చెప్పుకొస్తున్నారు. ఉత్తమ్ తర్వాత శ్రీధర్‌బాబే పీసీసీ చీఫ్ అని ఆయన వర్గీయులు చెవులు కొరుక్కుంటున్నారట కూడా! అయితే రాష్ట్ర నేతల తీరుని గమనిస్తున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రస్తుతానికి ఈ తేనెతుట్టెని కదపకుండా ఉత్తమ్‌నే కొనసాగించాలన్న ఆలోచన చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.