శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (09:31 IST)

తెలంగాణాలో తొలి కరోనా టీకీ ఎవరికో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినట్టుగా ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఇందుకోసం కరోనా టీకాల డోస్‌లు ఆయా రాష్ట్రాలకు పంపించారు. అలాగే, తెలంగాణాకు కూడా ఇవి వచ్చి చేరాయి. అదేసమయంలో ఈ టీకా వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో తొలి కరోనా టీకాను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా ఇస్తారు.
 
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభమవుతాయి. అలాగే, తొలి రోజు టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే. నిజానికి తొలి రోజు 99 ప్రభుత్వ కేంద్రాలు, 40 ప్రైవేట్ ఆసుపత్రులలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రులలో వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి విరమించుకుంది. 
 
ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాలు వేస్తే, సమస్యలపై అవగాహన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి తొలి వారంలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే టీకా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాతి నుంచి ప్రైవేటు ఆసుపత్రులలోనూ టీకా వేయనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలిపారు.
 
నేటి సాయంత్రానికి యాప్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీకా పంపిణీ తర్వాత కూడా సమస్యలు ఎదురైతే ఆఫ్‌లైన్‌లోనే సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 104 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు.