1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:52 IST)

సత్తా చాటిన సిద్ధిపేట.. వ్యాక్సినేషన్‌లో ప్రైమ్ మినిస్టర్ అవార్డ్

vaccine
సిద్ధిపేట జిల్లా సత్తా చాటింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్ధిపేట మంచి ఫలితాలను సాధించింది. 
 
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019కి ఎంపిక చేసింది. 
 
ఇందులో భాగంగా ఏప్రిల్ 20-21న ఢిల్లీలో జరిగే "సివిల్ సర్వీసెస్ డే" కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది.
 
సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 
 
రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి వంద శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుంద‌ని హరీష్ రావు వ్యాఖ్యానించారు.