బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (08:07 IST)

సోమేశ్ కుమార్ నియామకం క్విడ్ ప్రో కో లాంటిదే: దాసోజు అనుమానం

రాష్ట్రంలో పాలనా పరంగా ఎంతో కీలకమైన పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎంపిక విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియమ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు.
 
చీఫ్ సెక్రెటరీ నియామకం లో  నిబంధనలకు తిలోదకాలిచ్చారని అన్నారు. బ్యూరోక్రాటిక్ ప్రిన్సిపుల్స్ కు, స్టాండర్డ్ ప్రొటొకాల్స్ కు, చీఫ్ సెక్రెటరీ నియామకం నిబంధనలకు వ్యతిరేకంగా నియమించినట్లుగా తాము భావిస్తున్నామన్నారు. ఇది క్విడ్ ప్రో క్రో అతి అనుమానం కలుగుతుందని అన్నారు.
 
గతంలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు సోమేశ్ కుమార్ కమిషనర్ గా పని చేసిన సందర్భంలో దాదాపు 15 లక్షల మంది అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోయారని . చాలా మంది అర్హత లేనటువంటి వ్యక్తులు, దొంగ ఓటర్లు లక్షలాదిగా నమోదు చేయబడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి .
 
సోమేశ్ కుమార్ కమిషనర్ గా ఉన్న కాలంలో ఎలాగైనా సరే టిఆర్ఎస్ ను గెలిపించాలనే కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు,  ఆయన పూర్తిగా అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ తెరాస ప్రభుత్వ పథకాల ప్రచారం చేశారని  ఆరోపణలు ఉన్నాయి . అలాగే  టిఆర్ఎస్ విజయానికి తన వంతుగా సహకారం అందించారని  విమర్శలు ఉన్నాయి,
 
సోమేశ్ కుమార్ కంటే ముందు వరుసలో దాదాపు 15 సీనియర్ ఐఏఎస్ అధికారులు రేసులో ఉన్నా, వీరందరిని కాదని ఇతనిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడంలో ఆరోపణలు అన్ని నిజమేనా అనే అనుమానం కలుగుతుందని శ్రవణ్ అన్నారు . ఇది నిజంగా క్విడ్ ప్రో కో నా అనే అనుమానం .
 
తెలంగాణాలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందరో రేసులో ఉన్నప్పటికీ ఆంధ్రా కేడర్ కు చెందిన సోమేశ్ కుమార్ ను సీఎస్ గా అప్పగించడం దారుణమన్నారు.  ఆయన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవలసి ఉండగా రకరకాల ప్రయత్నాల ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ( క్యాట్) నుండి స్టే తెచ్చుకొని తెలంగాణలో కొనసాగుతున్నారు అని అన్నారు. 

సోమేశ్ కుమార్ నాలుగేళ్ల సర్వీస్ ఉందని నిలకడ ఉన్నటువంటి పరిపాలన అందిస్తాడని ముఖ్యమంత్రి అన్నారని కానీ  ప్రతేకమైన క్యాట్ ఇచ్చిన స్టే ఎత్తి వేస్తే సోమేశ్ కుమార్ తిరిగి ఆంధ్రకు వెళ్లాల్సి వస్తుందనిన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి అన్నట్లు నిలకడ ఉన్నటువంటి పరిపాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు .
 
సోమేశ్ ఉంటే మెరుగైన పాలన అందిస్తారని ఎంపిక చేశామంటూ సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పని చేసే సమర్థత కలిగిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ లు ఎందరో ఉన్నారని, వీరు తెలంగాణ సీఎస్ పోస్టుకు పనికి రారా అని దాసోజు ప్రశ్నించారు.
 
ఒక ఎమ్మెల్యే జీవిత కాలంలో మంత్రిగానో లేదా సీఎం కావాలని అనుకున్నట్లే ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ కావాలని అనుకుంటారని అన్నారు. ఇప్పటికే దాదాపు 12 మంది కొత్త గా సెలెక్ట్ అయిన ఐఏఎస్ అధికారులు పోస్టింగుల కోసం వెయిట్ చేస్తున్నారని అన్నారు. రిటైర్డ్ అయిన అధికారులను కొనసాగీస్తూ పాలనను భ్రష్టు పట్టించారని దాసోజు ధ్వజమెత్తారు.
 
తెరాస నాయకుల ప్రాబల్యం కలిగిన వారే సీఎంఓలో తిష్ట వేశారంటూ ఆరోపించారు. తోలు బొమ్మల్లాగా తలూపుతూ పని చేసే వారు, డూడూ బసవన్నలకు ప్రధాన పోస్టులను అప్పగించారని దాసోజు విమర్శించారు. దీని వల్ల మంచి పరిపాలన లభించదన్నారు. ప్రతి దానికి స్పందించే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సోమేశ్ కుమార్ నియామకంపై నోరు మెదపడం లేదు ఎందుకని దాసోజు ప్రశ్నించారు.

ఇప్పటికే ఆయనపై క్యాట్ లో కేసు నడుస్తోందన్నారు. సీనియర్లు, జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్య భేదాభిప్రాయాలు నెలకొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాలనా పరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని, మొత్తంగా సీఎం కేసీఆర్ విభజించు పాలించు అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడని శ్రవణ్ మండిపడ్డారు.
 
ఎందరో అధికారులు సీఎస్ పదవికి అర్హులైనా వారందరిని కాదని, వారి సీనియారిటీని పక్కన పెట్టి సీఎం సోమేశ్ కుమార్ కు పదవి కట్టబెట్టడం అధికార దుర్వినియోగాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాలనా పడకేసిందని, జనం సమస్యలను పట్టించుకునే  స్థితిలో అధికారులు లేకుండా పోయారన్నారు. సీఎస్ ఎంపిక విషయంలో సీనియారిటీ, సమర్థత, అనుభవం, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే సోమేశ్ కు పదవి కట్టబెట్టారని అన్నారు.

సీనియారిటీ పరంగా చూస్తే సీఎస్ రేసులో తెలంగాణ కేడర్కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి ఉండగా, ఇక 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా ఉండగా వీరిని కాదని వీరిని కాదని సోమేశ్ కుమార్ ను ఎంపిక చేశారని అన్నారు.

1989 బ్యాచ్ కు చెందిన సోమేశ్ కుమార్ కు సీఎస్ పదవి కట్టబెట్టారంటూ ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసిసి ఆదివాసీ విభాగం వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్, అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.