కుక్క కోసం తెలంగాణలో చితక్కొట్టుకున్నారు...
సాధారణంగా మనుషులు ఆస్తుల, డబ్బుల కోసం గొడవపడుతుంటారు. అయితే వీటితో సంబంధం లేకుండా కేవలం కుక్క కోసం విచక్షణారహితంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఒక కాంగ్రెస్ నేత కుక్క కోసం ఇద్దరు మహిళలను చితక్కొట్టారు. చివరకు కుక్క పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరడంతో కేసు నమోదైంది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. పక్కింటి పరిసరాలు అపరిశుభ్రం చేస్తోంది. తమ ఇంటి ముందు పరిసరాలను కుక్క అపరిశుభ్రంగా చేస్తోందని ఎన్నిసార్లు చెప్పినా సందీప్ కుటుంబం పట్టించుకోలేదు. దీంతో వారు సందీప్‌ను నిలదీశారు. దీంతో తమనే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు.
ఇరుగు పొరుగు వారు సర్దిచెబుతున్నప్పటికీ సందీప్ ఆగలేదు. ఎవరు అడ్డువచ్చినా మహిళలపై తన ప్రతాపాన్ని చూపించాడు. సందీప్ మహిళలపై చేస్తున్న దాడిని అక్కడ ఉన్నవారు తమ సెల్ ఫోన్‌లలో బంధించారు.
ఎవరు అడ్డుకున్నా ఆగకుండా, వారు కిందపడిపోయినా వదలకుండా సందీప్ వారిపై పిడిగుద్దులు గుద్దాడు. స్థానికంగా ఈ గొడవ వివాదాస్పదంగా మారింది. గాయపడిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌ను అరెస్టు చేశారు.