మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:38 IST)

కేసీఆర్ పతనం మునుగోడు నుంచే మొదలు.. అమిత్ షా ఫైర్

Amit shah
Amit shah
తెలంగాణ పర్యటనలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వున్నారు. ఈ సందర్భంగా మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభం కావాలన్నారు. 
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక కేసీఆర్ పతనానికి నాంది అని భావిస్తున్నట్లు చెప్పారు. 
 
కేసీఆర్ అండ్ కంపెనీ.. తెలంగాణను దోచుకుంటోందని అమిత్ షా ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తామన్నారు.. నల్గొండలో ఆస్పత్రి నిర్మించారా అని నిలదీశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఇంతవరకు ఎందుకు చేయలేదో.. దళితులు ఆలోచించాలని సూచించారు.
 
మరోసారి టీఆర్ఎస్ గెలిచినా దళితుడు ముఖ్యమంత్రి కాబోరని.. కేసీఆర్ గానీ.. కేటీఆర్ గానీ సీఎం అవుతారని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేసీఆర్ రైతుల వ్యతిరేకి అని అమిత్ షా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నా.. కేసీఆర్ ఎందుకు ట్యాక్స్ తగ్గించడం లేదని ప్రశ్నించారు.