తెలంగాణ భవన్‌లో తుపాకీతో తెరాస నేత హల్చల్...
తెలంగాణ భవన్‌లో తుపాకీతో తెరాస పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత హల్చల్ చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గన్‌తో హల్‌చల్ చేశారు. టీఆర్ఎస్ భవన్ దగ్గర జరిగిన సంబరాల్లో భాగంగా.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు కట్టెల శ్రీనివాస్ యత్నించారు. అయితే పక్కనున్నవారు ఆపడంతో.. వెంటనే తేరుకున్న శ్రీనివాస్ దాన్ని జేబులో పెట్టుకున్నారు.
కాగా, రాష్ట్రంలో గత ఆదివారం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానంలో ఎస్ వాణీదేవి, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజేతలుగా నిలిచారు.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్ నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది. దాదాపు నాలుగురోజుపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ గులాబీ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శించారు.
ఎలిమినేషన్ ప్రక్రియ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్‌కు కేవలం 21 రోజులముందు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వాణీదేవి అతికొద్ది సమయంలోనే సిట్టింగ్ అభ్యర్థి, బీజేపీకి చెందిన రాంచందర్‌రావును మట్టి కరిపించారు.